Ap రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత పెంచారు.
వైఎస్సార్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలను దగ్గర చేసుకునేందు కు జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాల పైన పూర్తి స్థాయి విశ్లేషణ తరువాత వచ్చే ఎన్నికల కోసం జగన్ తన ఆలోచనల్లో మార్పు చేసుకుంటున్నారు. ఫలితంగా ఉండవల్లి అంగీకరిస్తే ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన మరో ఇద్దరు సీనియర్లు సైతం జగన్ తో కలిసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయం హోరా హోరీగా మారుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం పైన విమర్శలను ఎక్కు పెట్టారు. ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పని చేస్తానని హామీ ఇస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. గత అనుభ వాలు.. ఓటమితో జగన్ వ్యూహం మార్చారు. నాడు వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు సాగుతున్నాయి. అందులో భాగంగా మాజీ ఎంపీ ఉండవల్లి గురించి పార్టీ ముఖ్యల వద్ద కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉండవల్లి వైసీపీలోకి వస్తే తగిన గౌరవం.. ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఉండవల్లితో సన్నిహితంగా ఉండే నేతలు.. ఆయన్ను ఒప్పంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
రూటు మార్చిన పవన్ - కొత్త రాజకీయం మొదలు..!!
ఉండవల్లి అంగీకరిస్తే తగిన ప్రాధాన్యత
తాజాగా రాజమండ్రి జైలులో అంబటిని పరామర్శించిన ఉండవల్లి తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైనా స్పందించారు. తాను సిట్ నివేదికలో అంశాలనే ప్రస్తావించినా తనను ఫోన్ చేసి కొందరు దుర్భాషలాడుతున్నారని ఆ తరువాత చెప్పుకొచ్చారు. క్రియాశీలక రాజ కీయాలకు ఉండవల్లి దూరంగా ఉంటున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. రాజకీయ అంశాల పైన స్పందిస్తున్నారు. 2019లో జగన్ సీఎం అయిన సమయం లో పూర్తి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత జగన్ పైన విమర్శలు చేసారు. తాజాగా జగన్ ఓడిన తరువాత పరిమితం గానే స్పందిస్తున్నారు. ఉండవల్లిని వైసీపీలోకి రావాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించిన ట్లు తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడుగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారు. ఉండవల్లి త్వరలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. కానీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక, కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న తూర్పు గోదావరి, ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు వైసీపీలో చేరటం ఖాయమైందని సమాచారం. దశల వారీగా పార్టీలో సీనియర్ల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరికల అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
