భార్య ఉరి వేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసిన భర్త

వైస్సార్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కోపంతో ఉరివేసుకునేందుకు ప్రయత్సిస్తుంటే.. ఆపాల్సిన భర్త, సరిగ్గా వేసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తూ కిటికీలో నుంచి వీడియో తీసిన అమానుష ఘటన చోటుచేసుకుంది.


ఈ ఘటనలో పాపం ఆ అమాయకపు ఇల్లాలు.. ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయినపల్లికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ అనే వ్యక్తి.. రైల్వేలో లోకో పైలెట్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్‌కు కృష్ణవేణితో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య గురువారం మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్యకు యత్నించారు. గది తలుపులకు గడియ పెట్టుకున్న కృష్ణవేణి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త శ్రీనివాస్.. అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. భార్య ఉరివేసుకుంటున్న దృశ్యాలను కిటీకీ నుంచి వీడియో తీయటం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఉరి ఎలా వేసుకోవాలనే దానిపై భార్యకు కిటికీలో నుంచి ఉచిత సలహాలు అందించారు. ఈ విషయం మొత్తం తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు.

భర్త చేసిన పనితో మరింత మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, తలుపులు బద్ధలు కొట్టారు. అయితే అప్పటికే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శ్రీనివాస్ అలా వీడియో తీయటం వెనుక కారణాలను ఆరా తీస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే శ్రీనివాస్ తీసిన వీడియో ఎలాగో బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. భార్య ఉరివేసుకుంటూ ఉంటే.. కాపాడాల్సింది పోయి ప్రోత్సహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు శ్రీనివాస్‌కు ఇది రెండో వివాహమని.. మొదటి భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని.. కృష్ణవేణి కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఆ విషయాన్ని దాచి కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడని.. నిత్యం వేధించేవాడని చెప్తున్నారు.