Child urinates into a coconut shell inside a car—Netizens outraged at mother for tossing it onto the road!

ఒక మహిళ తన చిన్న కుమారుడితో కొబ్బరి చిప్పలో మూత్ర విసర్జన చేయించింది. అనంతరం ఆ చిప్పను ఏమాత్రం సంకోచించకుండా కారు కిటికీలోంచి రోడ్డుపైకి విసిరేసింది.

కారు నడుపుతున్న ఆమె భర్త వీడియో తీయడం గమనార్హం. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) తమ అధికారిక 'X' ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, సదరు దంపతుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పౌర స్పృహ (Civic Sense) కరువైన ఇలాంటి చర్యలను సమర్థించలేమని పేర్కొంది.

ఈ వీడియోలో తండ్రి డ్రైవర్ సీటులో కూర్చుని వీడియో తీస్తుండగా, పక్క సీటులో ఉన్న తల్లి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. ఏదో గొప్ప పని చేస్తున్నట్లుగా దీనిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడంపై NCIB అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవర్తన సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించింది. సౌకర్యం పేరుతో కనీస పౌర బాధ్యతలను విస్మరించడం ఆందోళనకరమని పేర్కొంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 43,000 పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు ఈ చర్యను "సిగ్గుచేటు", "దయనీయం" అని అభివర్ణిస్తున్నారు. కేవలం మూత్ర విసర్జన చేయించడమే కాకుండా, ఆ వ్యర్థాలను బహిరంగంగా రోడ్డుపై పారవేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సాధారణ పౌర నియమాలను అతిక్రమించడం ఒక అలవాటుగా మారిపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.