తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలకు చెందిన డబ్బింగ్ లు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి.
ఇందులో ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇది ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అయినప్పటికీ తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొండపై తెగిపడిన తల ఎవరిది, అతణ్ని ఎవరు హత్య చేశారు అనే పాయింట్ చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది. కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసివేయాలని అనుకుంటారు. అప్పుడే కొండపై మొండెం లేని తల ఒకటి పోలీసులకు దొరకుతుంది. అసలు ఆ తల ఎవరిది? అతనిని ఎవరు చంపారు? మృతుడి మొండెం ఏమయ్యింది? అనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మృతుడు వాచ్ మెకానిక్‌గా, ఏనుగు శిక్షకుడిగా, అక్రమ కార్యకలాపాలలో చిక్కుకున్న బాడీగార్డ్‌గా పనిచేశాడని పోలీసులు తెలుసుకుంటారు?మరి ఆ తర్వాత ఏం జరిగింది? హంతకుడిని ఎలా పట్టుకున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ పేరు 'కాట్టాన్'. రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ మణికందన్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, ముత్తు కుమార్, సింగం పులి, బాలాజీ, వడివేలు మురుగన్, రిష జాకబ్స్, వీజే పారు, కళైవాణి భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ కాట్టాన్ వెబ్ సిరీస్ సీజన్ 1 లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. వారానికో ఎపిసోడ్ ట్రెండ్ కాకుండా ఒకేసారి మొత్తం 10 ఎపిసోడ్లను జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 10 ఎపిసోడ్లు కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.
