These are the best sunset spots in the country... Once you visit, you'll want to go back again and again!

దేశంలో బెస్ట్ సూర్యాస్తమయం స్పాట్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్తారు..!

సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దృశ్యాలు. వీటిని చూసినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ సుందరమైన దృశ్య కావ్యాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.

కొండ కోనల నడుమ నుంచి సూర్యుడు అస్తమించే అద్భుతమైన సీన్ ను చూసేందుకు చాలా మంది అనేక ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. అయితే మన దేశంలోనూ ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

మొదటగా గుజరాత్ లోని గ్రేట్ రన్ ఆఫ్ కచ్ ప్రాంతం శీతాకాలంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ఉప్పు నేలలను వింటర్ లో చూసేందుకు చాలా మంది పర్యటకులు వెళ్తుంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో ఇక్కడికి చేరుకుంటే చాలు.. ఆ సమయంలో ఆకాశం నారింజ, గులాబీ, పసుపు రంగు కలయికతో మెరిసిపోతుంది. ఆ రంగులన్నీ ఉప్పు నేలపై అద్దంలా ప్రతిబింబించి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మరోవైపు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ జరిగే రణ్ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక కేరళ, తిరువనంతపురం జిల్లాలో ఉన్న అందమైన తీర ప్రాంతాల్లో ఒకటి వర్కాల. ఇక్కడ వింటర్ సీజన్ లో ఆకాశం మేఘ వర్ణమై ఉంటుంది కాబట్టి సన్ సెట్ అద్భుతంగా ఉంటుంది. వర్కాలలో ఉన్న కొండపై నుంచి అరేబియా సముద్రాన్ని కూడా వీక్షించవచ్చు. ఇక్కడ సూర్యోదయంతో పాటుగా సూర్యాస్తమయం కూడా చాలా అందంగా ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడి కెఫేలు, రెస్టారెంట్లు కూడా సందర్శకులతో నిండిపోయి ఉంటాయి.

రాజస్థాన్ లోని జై సల్మేర్ వద్ద థార్ ఎడారి మధ్య సూర్యుడి అస్తమయాన్ని చూడడం మరచిపోలేని అనుభూతిని మిగిలిస్తుందని పర్యటకులు చెబుతున్నారు. సన్ సెట్ ముగిసే కొద్దీ ఇసుకపై పొడవైన నీడలు పడుతుంటాయి. ఈ క్రమంలో బంగారు, ఎర్రటి కాంతుల వర్ణంతో ఇసుక మెరుస్తూ కనిపిస్తుంది. ఎడారిలో ఈ సుందరమైన దృశ్యాల్ని చూసేందుకు పర్యటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.