సీతాపూర్: నాడు ముఖంపై రోమాలు ఉన్నాయంటూ ట్రోలింగ్‌కు గురైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన టాపర్ ప్రాచీ నిగమ్ మరోసారి సంచలనం సృష్టించింది. 10వ తరగతిలో యూపీ బోర్డు టాపర్‌గా నిలిచిన ఆమె, తాజాగా వెలువడిన 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఫలితాల్లోనూ 91.20 శాతం మార్కులతో విజయాన్ని నమోదు చేసి ఆదర్శంగా నిలిచింది.
దిమ్మతిరిగే మార్కులు
సీతాపూర్ జిల్లాకు చెందిన ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని కీలక సబ్జెక్టుల్లో కళ్లు చెదిరే మార్కులు సాధించింది. గణితంలో ఏకంగా 99, హిందీలో 96, కెమిస్ట్రీలో 95, ఫిజిక్స్‌లో 93 మార్కులు సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఇంగ్లీష్‌లో మాత్రం ఆమెకు 73 మార్కులు వచ్చాయి. జేఈఈ (JEE) ప్రవేశ పరీక్ష సన్నాహాలపైనే తాను పూర్తిగా దృష్టి సారించడం వల్లే ఆంగ్లంలో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయానని ప్రాచీ తెలిపింది.
ఐఐటీ లక్ష్యంగా..
2024లో టెన్త్‌లో 600లకు గాను 591 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన సమయంలో ప్రాచీ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె ముఖంపై ఉన్న రోమాలను చూసి కొందరు దారుణంగా హేళన చేశారు. అయితే ఆ విమర్శలేవీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థ అయిన ఐఐటీలో (ఐఐటీ) చదివి, గొప్ప ఇంజనీర్ కావాలన్న దృఢ సంకల్పంతో ప్రాచీ ముందుకెళ్తోంది.
