AP News: రాష్ట్రంలో కౌమార బాలికల గర్భధారణ సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 25 జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని తెలిపారు.
ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇందుకు బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలియని వయసులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు చిన్న వయసులోనే గర్భధారణకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేదన చెందారు.
దీని ప్రభావంతో తల్లి, శిశువుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. మాతాశిశు మరణాల ప్రమాదం పెరుగుతుందని అన్నారు. సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో టీనేజీ గర్భధారణ సగటు 8.80 శాతం:
గత ప్రభుత్వంలో ఈ సమస్యపై సరైన దృష్టి లేకపోవడంతో టీనేజ్ గర్భధారణ రాష్ట్ర సగటు 8.80 శాతానికి పెరిగింది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ కార్యక్రమం(Rashtriya Kishor Swasthya Karyakram) సహా కేంద్ర, రాష్ట్ర అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిశోర బాలికలకు లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనతపై సరైన అవగాహన కల్పించడంలో లోపాలు ఇందులో స్పష్టంగా బయటపడుతున్నాయి.
సున్నాకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు:
టీనేజ్ గర్భధారణ లక్ష్యం సున్నా శాతంగా ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 2025-26 నాటికి 5 శాతానికి తగ్గించడం బెంచ్‌మార్క్‌గా అధికారులు నిర్ణయించారు. దశలవారీగా సున్నా స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బెంచ్‌మార్క్ కంటే తక్కువ శాతం నమోదు చేసిన జిల్లా విశాఖపట్నం 3.98 శాతంగా ఉంది. మిగిలిన జిల్లాల్లో 5 శాతం నుంచి 12 శాతం దాటిన కేసులు అనేకం ఉన్నాయి. ఇలా పల్నాడు జిల్లాలో 14.94 శాతం, కర్నూలు జిల్లాలో 13.50 శాతం కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసువచ్చేందుకు బహుళ శాఖల సమన్వయం, గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, బాల్య వివాహాలు నిర్మూలనపై కఠిన చర్యలు అత్యవసరంగా మారాయి. టీనేజ్‌లోనే గర్భదాల్చితే ఎన్నో ఆరోగ్యకరమైన సమస్యలు రక్తహీనత వంటివి వచ్చే అవకాశం ఉంది.
సమస్యలు ఎన్నో:
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు ప్రధాన అడ్డంకులు
బాల్య వివాహాల నియంత్రణలో లోపాలు
లైంగిక పునరుత్పత్తి విద్యపై అవగాహన కొరత
అర్హత లేని కేంద్రాల్లో గర్భస్రావాలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు
పూర్తి గర్భధారణ వచ్చినా సహజ ప్రసవం కాకపోవడం
సి సెక్షన్ శస్త్రచికిత్సల పెరుగుదల
పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు
తక్కువ బరువుతో పుట్టే శిశువులు
ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల ప్రాణాపాయం
