లక్నో : అక్రమ సంబంధాలు చివరకు హత్యలకే దారితీస్తున్నాయి. భార్యాభర్తలు, అత్తమామలు, తల్లిదండ్రులు.. ఇలా ఎంతోమంది ఈ దారి తప్పిన బంధాలకు బలవుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మనసు కలచివేసే ఒక క్రూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలతో కళకళలాడాల్సిన ఒక పచ్చని సంసారం వివాహేతర సంబంధం కారణంగా ఛిన్నాభిన్నమైంది.
అద్దెకు వచ్చిన యువకుడితో అక్రమ సంబంధం: త్రిదేశ్, రంజన దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరితో పాటు త్రిదేశ్ తల్లి నిర్మలా దేవి (69) కూడా అదే ఇంట్లో ఉండేవారు. లక్నోలో వీరికి రెండు అంతస్తుల ఇల్లు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కుటుంబం నివసిస్తుండగా, మొదటి అంతస్తును అద్దెకు ఇచ్చారు. త్రిదేశ్ తన పని నిమిత్తం తరచూ బయట ఊర్లకు వెళ్లేవాడు, కొన్నిసార్లు వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. భర్త ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న రంజన, తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజన్ అనే యువకుడితో సంబంధం పెట్టుకుంది. రాజన్ ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడు.
అడ్డువచ్చిన అత్తపై ఘాతుకం: పిల్లలు స్కూలుకు వెళ్ళిన తర్వాత రంజన నేరుగా పై అంతస్తుకు వెళ్లి రాజన్‌తో గడిపేది. ఇది గమనించిన అత్త నిర్మలా దేవి, కొడుకు సంసారం పాడవకూడదని భావించి కోడలిని మందలించింది. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికింది. తన సంబంధానికి అత్త అడ్డు పడుతోందని ఆగ్రహించిన రంజన, తన ప్రియుడితో కలిసి ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
కిరాతక హత్య: నిందితులిద్దరూ కలిసి నిర్మలా దేవి చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో బట్టలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అంతటితో ఆగక, ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. పరీక్ష రాసి ఇంటికి వచ్చిన మనవడు, గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మ్మమ్మను చూసి భయపడి తండ్రికి ఫోన్ చేశాడు. త్రిదేశ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఇంటికి చేరుకున్నాడు. తన భార్య, అద్దెకు ఉన్న యువకుడే ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశాడు.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్తను కట్టేసి, ఆమె ముందే నిందితులిద్దరూ అసభ్యంగా ప్రవర్తించారని, ఆపై హింసించి చంపేశారని వెల్లడైంది. ప్రస్తుతం రంజన, ఆమె ప్రియుడు రాజన్ జైలు పాలయ్యారు.
