Teenage Girls Are the Target: Criminals Run Rampant, Using Social Media as Their Hub.

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి :సజ్జనార్, సీపీ, హైదరాబాద్‌

ఫ్రెండ్‌షిప్‌ పేరుతో యువతులకు వల
వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి మార్ఫింగ్‌
డబ్బులు డిమాండ్‌ చేయడంతో పాటు లైంగిక వేధింపులు
డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు పోర్న్ సైట్లలో పెడతామని బ్లాక్ మెయిలింగ్.
హైదరాబాద్, వెలుగు: సోషల్‌ మీడియా అడ్డాగా సైబర్‌ నేరగాళ్లు, పోకిరీలు రెచ్చిపోతున్నారు. నకిలీ ప్రొఫైల్స్, ఫేక్‌ డీపీలతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించి, చాటింగ్‌ చేస్తూ ఫ్రెండ్‌షిప్‌ పేరిట అమ్మాయిలను లోబరుచుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయిల వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి వాటి సాయంతో బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగుతున్నారు. డబ్బులు డిమాండ్‌ చేయడంతో పాటు తాము చెప్పినట్లు వినాలని లేదంటే తమ వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా, పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోకిరీల ఆగడాలను తల్లిదండ్రులతో చెప్పుకోలేక యువతులు, బాలికలు కుమిలిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి బ్లాక్‌ మెయిలింగ్స్‌ పెరిగిపోవడంతో అమ్మాయిలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌తోనే అంతా...

అమ్మాయిలు, యువతులకు అరచేతిలో ఉండే స్మార్ట్స్‌ ఫోన్లే శాపంగా మారుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు, పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, స్కైప్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకొని అమ్మాయిలకు వల వేస్తున్నారు. ఫీమేల్ అని తెలిస్తే చాలు.. లైక్‌లు కొడుతూ, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతూ ఫ్రెండ్‌షిప్‌ పెంచుకుంటున్నారు. ప్రధానంగా టీనేజీ అమ్మాయిలను టార్గెట్‌ చేసి, వారి మొబైల్ నంబర్లకు వాట్సప్‌లో వాయిస్‌ కాల్‌ చేస్తున్నారు. స్పందించిన బాలికలు, యువతులతో చాటింగ్‌ చేస్తూ వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.

ముందుగా ఫ్రెండ్‌ షిప్‌.. తర్వాత బ్లాక్‌మెయిల్‌

యువతులతో చాటింగ్‌ చేస్తున్న వ్యక్తులు ముందుగా తమపై ఎలాంటి అనుమానం రాకుండా మాయమాటలు చెప్తున్నారు. కొంత కాలం వరకు ఫ్రెండ్‌ షిప్‌ చేసి, తర్వాత మెల్లిగా పెండ్లి ప్రస్తావన తీసుకొస్తూ అమ్మాయిలను లోబరుచుకుంటున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. తర్వాత వాటిని చూపిస్తూ.. అమ్మాయిలను బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెడుతున్నారు. డబ్బులు డిమాండ్‌ చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియా, పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తామని, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా మోసపోయిన అమ్మాయిలు విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి :సజ్జనార్, సీపీ, హైదరాబాద్‌

సోషల్‌ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్‌ అమ్మాయిల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. టీనేజీలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. పిల్లల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఎలాంటి యాప్స్ ఉన్నాయి? ఏం చేస్తున్నారు? ఎలాంటి యాప్స్‌లో ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారో గమనించాలి. లైక్స్‌, విషెస్‌, కామెంట్లను ఆకట్టుకునే చాటింగ్‌లను నమ్మరాదు. బ్లాక్‌ మెయిల్‌ సహా ఎలాంటి వేధింపులకు గురిచేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.