భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఓ మహిళ పక్కా ప్లాన్ ప్రకారం చేసింది. ఏకంగా కోర్టు నే బురిడీ కొట్టించింది. తన సొంత చెల్లినే తన భర్త రెండో భార్యగా చిత్రీకరించి కోర్టును నమ్మించి విడాకులు పొందింది.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భర్త.. తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్టురట్టయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గ్వాలియర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళకు 1998లో వివాహం జరిగింది. మార్కెటింగ్ కంపెనీలో పనిచేసే భర్త ఉద్యోగరీత్యా తరచూ బయట ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2015 నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, విడాకులు ఇచ్చేందుకు భర్త నిరాకరించాడు.
దీంతో 2021లో సదరు మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకులు కావాలని పిటిషన్ వేసింది. ఇందుకు సాక్ష్యంగా భర్త తన సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫొటోను కోర్టుకు సమర్పించింది.
అందులో ఉన్న తన ఆడపడుచునే భర్త రెండో భార్యగా చెప్పి కోర్టును నమ్మించింది. ఆమె సమర్పించిన ఆధారాలపై ఆధారపడిన ఫ్యామిలీ కోర్టు, ఆమెకు అనుకూలంగా ఏకపక్ష విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
ఈ నెల ఏప్రిల్ మొదటి వారంలో ఈ విషయం తెలుసుకున్న భర్త షాక్‌కు గురయ్యాడు. కోర్టు రికార్డులను పరిశీలించగా, తన భార్య చేసిన మోసం బయటపడింది. దీంతో ఆమె కోర్టును తప్పుదోవ పట్టించి అక్రమంగా విడాకులు పొందిందని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన గ్వాలియర్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.
