Kamareddy crime news: A fight over not cooking non-veg.. A husband lost his life at the hands of his wife, an incident in Kamareddy

kamareddy crime news: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన చోటు చేసుకుంది. 

Crime news


కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఊహించని రీతిలో జరిగిన హత్య ఘటన కలకలం రేపింది. తనకు మాంసాహారం (చికెన్, మంటన్) వండలేదని భర్త చేసిన గొడవ చివరికి అతడిక ప్రాణాన్ని బలితీసుకుంది.

పట్టణంలోని గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ (28), లక్ష్మి దంపతుల మధ్య శనివారం రాత్రి భోజనం విషయంలో తగాదా మొదలైంది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన శివాజీ, ఇంట్లో నాన్ వెజ్ ఎందుకు వండలేదని భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. స్థానికులు వచ్చి సర్దిచెప్పినప్పటికీ, శివాజీ మళ్లీ తనను తిట్టడంతో ఆవేశానికి లోనైన భార్య లక్ష్మి ఇంట్లోని కొడవలిని భర్తపైకి విసిరింది.

దురదృష్టవశాత్తు ఆ కొడవలి శివాజీ మెడలోని ప్రధాన నరానికి బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. నిమిషాల్లోనే అతడికి తీవ్ర రక్తస్రావమైంది. నరం తెగడంతో కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు గొడవపడిన భార్య, భర్త విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయింది. క్షణికావేశంలో చేసిన తప్పునకు చింతించింది. ఆవేశంలో పొరపాటున భర్తను చంపుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భర్త చనిపోయాడు, ఇక తాను జైలుకు వెళ్తే తన ఇద్దరు చిన్న బిడ్డల పరిస్థితి ఏమిటని పిల్లలను గుండెలకు హత్తుకుని ఆమె ఏడ్చిన తీరు స్థానికులను కలచివేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కామారెడ్డి సీఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోదండం శివాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో వివాహమైన ఈ జంటకు సంతానం ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి జైలు పాలు, తండ్రి మరణించడంతో ఆ పసిపిల్లలు అనాథలుగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.