నవ వరుడిని మింగేసిన బెట్టింగ్ భూతం.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన.
ఐపీఎల్ సీజన్ వస్తే చాలు.. బెట్టింగుల్లో ఎంతోమంది నష్టపోయి ఆ నష్టాలను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా లక్నోలో నవ వరుడు ఐపీఎల్ లో భారీగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన రెండ్రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 8 నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోతోంది.
జాతీయ మీడియాలో వచ్చిన వివరాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ బెట్టింగ్ ఓ యువ ప్రాపర్టీ డీలర్ ను నిలువునా ముంచేసింది. లక్నోలోని కుర్సీరోడ్డులో జనేశ్వర్ అపార్ట్ మెంట్స్ లో ప్రబల్ జైన్ (35) భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో ప్రతీ బంతికి బెట్టింగ్ కాసి.. సుమారు రూ.70 లక్షల మేర నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. భార్యకు ఫోన్ చేసి ఐపీఎల్ బెట్టింగ్ లో చాలా నష్టపోయానంటూ ఏడ్చాడు. భర్త ఏడుస్తూ మాట్లాడటంతో శివాని కంగారుపడింది. కాసేపటికే ఫోన్ కట్ చేశాడు. తిరిగి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. వెంటనే అపార్ట్మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చివరి కాల్‌లో భార్యతో 25 నిమిషాల సంభాషణ
ఆత్మహత్యకు ముందు ప్రబల్ తన భార్య శివానికి ఫోన్ చేసి సుమారు 25 నిమిషాల పాటు మాట్లాడారు. "నేను సర్వస్వం కోల్పోయాను, నా పొదుపు మొత్తం పోయింది. దీనికి నేనే బాధ్యుడిని. సారీ శివాని..." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య ఎంత నచ్చజెప్పినా వినకుండా, ఆమె ఆఫీస్ నుండి ఇంటికి చేరుకునేలోపే జనేశ్వర్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశారు. శివాని ఇంటికి వచ్చేసరికి తన భర్త రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్పృహతప్పి పడిపోయింది. అపార్ట్మెంట్ వాసులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ఘటనా స్థలంలో పోలీసులకు 4 పేజీల సుసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, బెట్టింగ్ అలవాటే తనను ఈ స్థితికి తెచ్చిందని ప్రబల్ అందులో పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రబల్ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి బాల్‌పై, ప్రతి వికెట్‌పై ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడేవాడని తేలింది. ఈ క్రమంలో దాదాపు రూ.70 లక్షల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఏసీపీ అనింద్య విక్రమ్ సింగ్ ప్రబల్ ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన ఎవరితో చాట్ చేశారు, ఏ ఏ బుకీలతో సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో డేటా విశ్లేషణ జరుగుతోందని పేర్కొన్నారు. 8 నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ప్రబల్ తండ్రి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
