Budamera danger bells ring for Vijayawada city

విజయవాడ నగరానికి బుడమేర డేంజర్ బెల్స్, ఇంకా పూర్తికాని రక్షణగోణ, వరద వస్తే...?

Budamera danger bells ring for Vijayawada city

విజయవాడ నగరవాసులు బుడమేరు ఎన్నటికీ మర్చిపోలేరు. దాదాపు 10 రోజుల పాటు బుడమేరు వరద జలదిగ్బంధంలో నగరవాసులు విలవిలలాడారు. 24 మంది మృత్యువాత పడగా కోట్లలో ఆస్తినష్టం జరిగింది.

ఇంకో 2 నెలల్లో వర్షా కాలం రాబోతోంది. అప్పట్లో ఆపరేషన్ బుడమేరుతో మొత్తం దారికి తెస్తామని, గండ్లు పూడ్చటమే కాకుండా ఆక్రమణలు తొలగించి రక్షణ గోడలు నిర్మిస్తామని చెప్పారు.


కానీ బుడమేర పరీవాహక ప్రాంతంలో ఆ పరిస్థితి కనబడటంలేదు. గండి పడిన చోట ఇంకా నిర్మాణం పూర్తికాలేదు. ఈ నేపధ్యంలో వరదలు వస్తే... మళ్లీ బుడమేరు విశ్వరూపాన్ని విజయవాడ నగర ప్రజలు చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా వుండేందుకు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నది. ఈ విషయంపై బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ x లో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటో చూడండి.

ఈ రోజు ఈనాడులో వచ్చిన "వరదోస్తే... ప్రళయ బుడమేరే" అన్న కథనం ఒక విధంగా ఆలస్యంగా నైనా ముందస్తు హెచ్చరికగానే భావించాలి.

బుడమేరు వరద నిర్వహణ విజయవాడ నగరానికి ఎంత ముఖ్యమో కొల్లేరు సరస్సు పునరుజ్జీవనానికి కూడా అంతే ముఖ్యం.

"బుడమేరు వరదే కొల్లేరు సరస్సుకి జీవం" సముద్రపు నీరు కొల్లేరులోకి చొచ్చుకు రావడానికి బుడమేరు వరద మళ్ళింపే కారణం!!

ఈ విషయంలో ప్రభుత్వానికి నా సూచనలు :

గతంలో విజయవాడ ఎదుర్కొన్న వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, అది దశాబ్దాల పర్యావరణ విధ్వంసం, నిర్లక్ష్య పాలన, మరియు శాస్త్రీయ ప్రణాళికల లోపం ఫలితం. బుడమేరు కేవలం విజయవాడకు ముప్పు మాత్రమే కాదు అది మన రామ్సర్ గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సుకు జీవనాడి. బుడమేరు నీటిని కృష్ణా నదిలోకి మళ్లించడం అంటే కొల్లేరును క్రమంగా ఎండబెట్టి చంపేయడమే.

అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించే దిశగా ప్రభుత్వం ఈ క్రింది సూచనలను ప్రభుత్వం పరిశీలించి అమలు చేయాలని కోరుతున్నాను.

1. బుడమేరు డైవర్షన్ కెనాల్ (BDC) వద్ద స్మార్ట్ రెగ్యులేటర్లతో కూడిన ఆధునిక హైడ్రాలిక్ గేట్లతో శాస్త్రీయ నియంత్రిత ప్రవాహ విధానం అమలు చేయాలి. అత్యధిక వర్షపాతం వల్ల విజయవాడకు ముప్పు ఉన్న సందర్భాల్లో మాత్రమే నీటిని కృష్ణా నదికి మళ్లించాలి. మిగిలిన కాలంలో సహజ ప్రవాహం కొల్లేరుకే చేరేలా చూడాలి.

కొల్లేరు మంచినీటి సరస్సుగా నిలవడానికి బుడమేరు వరదనీరు అత్యంత కీలకం. ఈ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల సరస్సులో లవణీయత (Salinity) పెరిగి మొత్తం జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.

2. ఆక్రమణలకు గురైన సుమారు 380 ఎకరాల భూమిని హైడ్రా తరహాలో తక్షణమే స్వాధీనం చేసుకుని బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించాలి. ఆక్రమణలను తొలగించకుండా కేవలం రక్షణ గోడలు నిర్మించడం వల్ల ప్రవాహ సామర్థ్యం పెరగదు.

భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో "పోలిసింగ్ కమిటీలు" ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను ప్రజలే పర్యవేక్షించే విధానం తీసుకురావాలి.

3. బుడమేరు ద్వారా నగరాల మురుగునీరు కొల్లేరులోకి చేరకుండా బయో-రెమిడియేషన్ మరియు గ్రీన్ బ్రిడ్జ్ సాంకేతికతలను వినియోగించి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన పరిష్కారాలు అమలు చేయాలి.

4. ఉప్పుటేరు మరియు బుడమేరు కాల్వల్లో శాస్త్రీయ పద్ధతిలో పూడిక తొలగింపు చేపట్టి, నీరు నిల్వ కాకుండా సముద్రానికి సాఫీగా చేరేలా మార్గాలను పునరుద్ధరించాలి.

5. అమరావతి లేదా విజయవాడ పరిసరాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలి. బుడమేరు గట్ల బలోపేతాన్ని "మెకానికల్ నెసెసిటీ"గా గుర్తించి రాజకీయాలు, ఆలస్యాలు పక్కనపెట్టి అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలి.

6. కొల్లేరు సరస్సును కేవలం ఒక సరస్సుగా కాకుండా, అంతర్జాతీయ స్థాయి "నేచర్ బేస్డ్ ఎకో టూరిజం" కేంద్రంగా అభివృద్ధి చేయాలి. అక్రమ చేపల చెరువుల స్థానంలో స్థానిక మత్స్యకారులకు సంప్రదాయ చేపల వేటను ప్రోత్సహించడం ద్వారా వారి జీవనోపాధిని కాపాడుతూనే సరస్సు పర్యావరణాన్ని రక్షించవచ్చు..

ప్రకృతిని ఎదిరించి మనం జీవించలేం. బుడమేరు ఆక్రమణలను తొలగించి, కొల్లేరుకు దాని సహజ ప్రవాహాన్ని తిరిగి అందించడం పాలకుల బాధ్యత మాత్రమే కాదు అది భావితరాల పట్ల మన బాధ్యత, ప్రకృతి పట్ల మన కర్తవ్యం.

ప్రభుత్వం తక్షణమే పర్యావరణ నిపుణులు, హైడ్రాలజీ నిపుణులు, మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడిన హై-లెవల్ టెక్నికల్ మరియు పర్యావరణ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను..