తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్‌కు (Telangana Women Commission) కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.
అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మకు అవకాశం..
తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి త్యాగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నియామకంతో తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చాకలి ఐలమ్మ మనవరాలు..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబానికి ఈ నియామకంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
మరికొంత మందికి సభ్యులుగా అవకాశం..
మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి..
ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపులు, వివక్ష అంశాలపై చర్యలు తీసుకునే కీలక సంస్థగా పనిచేస్తుంది. కొత్త కమిషన్ మహిళా భద్రత, మహిళా హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది.
తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు..
ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కుటుంబాలకు అవకాశం కల్పించడం విశేషంగా మారింది. శ్రీకాంతచారి కుటుంబం, చాకలి ఐలమ్మ వారసులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉద్యమ చరిత్రను గుర్తు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
