సీఎంకు ఢిల్లీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: హరీశ్‌రావు.
సిద్దిపేట రూరల్, మే 12 (ఆంధ్రజ్యోతి): రైతుల పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు వేగవంతం చేసేవాళ్లమని చెప్పారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఢిల్లీ చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని ఆయన విమర్శించారు.
